జగన్‌తో శైలజానాథ్ మంతనాలు..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు.. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలీదు. కాకపోతే పైచేయి సాధించేందుకు మాత్రం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగు తోంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోకుండా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్‌తో మంతనాలు వెనుక ఏం జరిగింది?

 

రాజకీయాల్లో ఎత్తులు వేయడంలో జగన్‌కు తిరుగులేదని కొందరు చెబుతుంటారు. గడిచిన ఐదేళ్లలో అదే చేశారు. ఫలితం రివర్స్ అయ్యింది. పార్టీ నుంచి నేతలు వలస పోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు మాజీ సీఎం. ప్రత్యర్థులను ఎదుర్కొనే బదులు పార్టీ బలంగా ఉండేలా స్కెచ్ వేశారు.

 

ఐదేళ్ల జగన్ పాలనను చూసిన ఆ పార్టీ నేతలు.. ఫ్యాన్‌కు లైఫ్ లేదనే భావనకు వచ్చారు. ఈక్రమంలో వలస బాట పడుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. కాంగ్రెస్ నేతలను రప్పించుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుందని ఆలోచన చేస్తున్నారట.

 

జగన్ ఆలోచనకు తగ్గట్టుగా అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం కర్నూలు లో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు.

 

ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్టు ఓ వార్త గుప్పుమంది. దాదాపు అరడజను నేతలతో మాట్లాడారట. మాజీ పీసీసీ చీఫ్ రేపోమాపో వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్‌తోపాటు మరికొందరు నేతలున్నట్లు అంతర్గత సమాచారం.

 

జగన్ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే వైసీపీ ఉండదని భావిస్తున్నారట. తన చెల్లెలు షర్మిలను రాజకీయంగా అడ్డుకట్ట వేస్తే తనకు తిరుగు వుండదని మాజీ సీఎం ఆలోచన. అటు కాంగ్రెస్‌ను వీక్ చేసినట్టు ఉంటుంది.. ఇటు వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నేతల భావన. వైసీపీ స్కెచ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *