వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుంది : ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం

దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా సంక్షోభం, వై2కే, 2008 ఆర్థిక మాంద్యం లాంటి వాటిని కూడా దేశీ ఐటీ కంపెనీలు గట్టెక్కాయని .. కానీ ప్రస్తుత కరోనా వైరస్‌ మహమ్మారి వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. ‘నేను 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టాను. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునరుద్ధరణకు చాలా సమయం పట్టేస్తుంది. 
అంతర్జాతీయ స్థాయిలో చూస్తే భారత కంపెనీలు విశ్వసనీయ భాగస్వాములని ఈ సంక్షోభంతో నిరూపితమైందని మహాలింగం చెప్పారు. లాక్‌డౌన్‌ వేళ కూడా సర్వీసుల డెలివరీలో సమస్యలు తలెత్తకుండా దేశీ ఐటీ కంపెనీలు వినూత్నమైన పరిష్కార మార్గాలు అమలు చేస్తున్నాయని ఆయన కితాబిచ్చారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక.. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణ తీరును పునఃసమీక్షించుకోగలవని.. తద్వారా ఐటీ సంస్థలకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు లభించగలవని మహాలింగం తెలిపారు. నిర్మాణ, తయారీ రంగ కంపెనీల్లో ఐటీ మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 
అమెరికాలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన సిలికాన్‌ వేలీలో స్టార్టప్‌ సంస్థలు.. ఉద్యోగాలు, జీతాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు.. కొత్త నియామకాలను కొంత కాలం నిలిపివేసే యోచనలో ఉన్నాయి. ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఎం రంగస్వామి ఈ విషయాలు తెలిపారు. సిలికాన్‌ వేలీలో వచ్చే నెల రోజుల్లో నిరుద్యోగిత భారీగా పెరిగే అవకాశం ఉందని, 2008 నాటి మాంద్యం సమయంలో కూడా చూడనంత స్థాయిలో ఉండొచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *