ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వానికీ వాలంటీర్లు మరో షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది యువతులు, మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లు గుంటూరు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టులో జరుగుతోంది. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాలంటీర్లకు షాక్ తగిలింది.
దీనిపై స్పందించిన వాలంటీర్లలు.. పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో పవన్ పై ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా వాలంటీర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది, జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వాలంటీర్ల తరపున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని పిటిషనర్లు ఆరోపించారు. త్వరలో ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకుందని వాలంటీర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.