ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.. అధికారం కోల్పోయాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మనసు మార్చుకుని టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానంతో జరిపిన చర్చలు కూడా ఫలించడంతో రేపు ఆ పార్టీలో చేరబోతున్నారు.
గతంలో అధికారంలో ఉండగా టీడీపీ నేతలు, కార్యకర్తలను అణచివేసిన ఆళ్ల నాని… ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఏలూరులో పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆళ్ల నానిని చేర్చుకునేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దీనిపై విమర్శలు ప్రారంభించారు. అయినా టీడీపీ అధిష్టానం ఇవేవీ పట్టించుకోలేదు. చివరికి పార్టీలో ఆళ్ల నాని చేరికకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసేసింది. దీంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
ముఖ్యంగా ఏలూరులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి చంటి.. ఆళ్ల నాని తమ పార్టీలో చేరికపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు కూడా ఆళ్ల నాని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. అయినా అధిష్టానం నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆళ్ల నాని చేరికపై టీడీపీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీ కాపు నేత అయిన ఆళ్ల నానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు తెలుస్తోంది.