హైదరాబాద్‌లో ఇటీవల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయత్‌నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో లోహిత్ ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం నాడు పాఠశాల తరగతుల భాగంగా.. ఫిజిక్స్ టీచర్ లోహిత్‌ను క్లాస్ లీడర్‌తో కొట్టించడంతో తీవ్ర మనస్తాపానికి గురై.. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఉపాధ్యాయులు టార్చర్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ రెడ్డి చనిపోయాడన్న విషయం పోలీసులు చెబితేనే తెలిసిందని బంధువులు చెబుతున్నారు.
అయితే క్లాస్ రూమ్‌లో అసలేం జరిగిందో ఇంతవరకు స్కూల్ యాజమాన్యం చెప్పలేదని విద్యార్ది తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ. లక్షల్లో ఫీజులు గుంజుకుని తమ పిల్లల చావుకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆత్మహత్య చేసుకున్న బాబు మృతదేహాన్ని ఉస్మానియా మార్చడానికి తరలించారు. నారాయణ స్కూల్ వేధింపుల వల్లే లోహిత్ చనిపోయాడు అంటూ స్కూల్ ముందు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు.
ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. లోహిత్ రెడ్డి స్కూల్ నుంచి వెళ్ళిపోతానని టీసి ఇవ్వమన్నా స్కూల్ యాజమాన్యం ఇవ్వలేదని బంధువులు చెబుతున్నారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే బాబు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.