హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెళ్లో బుల్డోజర్లు పరుగెత్తిస్తున్న హైడ్రా లక్ష్యాలు, అనుసరించనున్న విధివిధానాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడడానికి ముందు నిర్మించుకున్న నివాస స్థలాల జోలికి వెళ్లబోమంటూ ప్రకటించారు. అదే సమయంలో రానున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇంతకీ.. రంగనాథ్ ఏఏ విషయాల్లో స్పష్టతనిచ్చారు. కొంత మందికి ఊరట కలిగించే వార్త ఏంటి అంటే..
మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలంలోని మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ చెరువుల్లో కొందరు అక్రమార్కులు నిర్మాణ వ్యర్థలు, మట్టిలో నింపుతూ.. చెరువును ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఇతర అధికారులతో కాముని చెరువు వద్దకు వచ్చిన రంగనాథ్ అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాముని చెరువులో మట్టి పోసి చదును చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా కూల్చివేస్తామని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన వాళ్లు చిన్నవాళ్లైనా, పెద్ద వాళ్లైనా హైడ్రా విడిచిపెట్టదన్న కమిషనర్ రంగనాథ్.. చెరువుల రక్షణే హైడ్రా ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ చెరువు కబ్జాపై స్థానికులంతా ఒక్కటి కావడాన్ని అభినందించిన రంగనాథ్.. ఆక్రమణదారులపై హైడ్రాకు ఫిర్యాదు చేయడాన్ని ప్రశంసించారు. చెరువును రక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని చెప్పడాన్ని శుభ పరిణామమని అన్నారు.