బీఆర్ఎస్ భారీ షాక్.. కేటీఆర్ పై పోలీసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిబంధనల్ని తుంగలో తొగ్గి కోట్ల రూపాయల ఖర్చుతో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై కేసు, విచారణకు గవర్నర్ జిష్టు దేవ్ శర్మ అనుమతి మంజూరు చేశారు. దాంతో.. ఈ కేసులో ఇప్పటికే అన్ని వివరాలు దగ్గర పెట్టుకుని కాచుకుని కూర్చున్న ఏసీబీ.. వెంటనే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ -కార్ రేసింగ్ లో కీలక సూత్రధారిగా ఉన్న కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో.. మరోమారు తెలంగాణలో రాజకీయ రగడ మొదలుకానుంది.

 

రాష్ట్ర గవర్నర్ అనుమతితో ఇక అధికారులు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్ రేసులో ఏసీబీకి ఈ రాత్రికి నివేదిక చేరనుండగా.. ముందుగా ఎవరిని విచారణకు పిలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. గత కొన్నాళ్లుగా బాంబు పేలుస్తాముంటూ సంకేతాలు ఇస్తున్న మంత్రి పొంగులేటి ఈ కేసు విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్ రేసింగ్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన పొంగులేటి.. అందుకు ప్రతిఫలం ఎలక్షన్ సమయంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 18 రోజుల వ్యవధిలో విదేశీ మారకం చెల్లించారని ఆరోపించారు.

 

రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని.. బాంబు అనేది ఉంటేనే కదా పేలేది అంటూ వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయని వారికి ఉలుకెందుకు అన్న మంత్రి.. అర్థరాత్రి దిల్లీ వెళ్లి ప్రదక్షిణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.

 

ఈ కేసులో అధికారుల పాత్రపైనా రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా.. ఐఏఎస్ అరవింద్ ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో.. ఈ కార్ కేసు ఆయన మెడకు చుట్టుకున్నట్లే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు.. ఏసీబీ చర్యలు ఏ తీరుగా ఉండనున్నాయో తెలుసుకోవడమే తరువాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *