పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల లోపలా బయటా నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ, ప్రభుత్వం అవేవీ పట్టించుకోవడం లేదు. అయితే, ఈ నిరసనలను దేశవ్యాప్తంగా నిర్వహిచేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీపీసీసీ ఛలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చింది.
భారీ ర్యాలీకి ప్లాన్
18వ తేదీన బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం జరగనుంది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నుంచి రాజ్ భవన్ వరకు ఈ భారీ ప్రదర్శన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇందులో పాల్గొంటారు. అమెరికాలో గౌతమ్ ఆదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలు, దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఆదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మనిప్యులేషన్ లాంటి ఆరోపణలు ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అలాగే, మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోదీ సరిగ్గా స్పందించకపోవడం, ఇప్పటి వరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటి అంశాలను నిరసిస్తూ, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తోంది టీపీసీసీ. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొననుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రానున్నారు