ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం..

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ప్రమాణం చేయగా.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యా ప్రమాణస్వీకారం చేశారు. ఛైర్మన్ జగదీప్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా రాజ్యసభ్యునిగా.. టీడీపీ నుంచి సానా సతీష్ సభలో అడుగుపెట్టారు.

 

కొద్ది రోజుల క్రితం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి బలం లేకపోవడంతో.. మూడు రాజ్యసభ స్థానాలు కూటమికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక సంఘం ఇటీవల ప్రకటించింది. ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావును ఎంపిక చేయగా.. బీజేపీ ఆర్‌.కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ పార్టీ మారిన తర్వాత కూడా ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు మళ్లీ అవకాశం దక్కడం హాట్ టాపిక్‌గా మారింది.

 

వ్యాపారవేత్తగా పేరు గాంచిన బీద మస్తాన్ రావు.. 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు‌. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. కానీ ఈ ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్ సమయానికి.. వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతోనే.. సైకిల్ గూటికి చేరి మళ్లీ సీటు దక్కించుకున్నారని సమాచారం. అలానే ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్‌కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.

 

మొదటి నుంచి బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు ఆర్.కృష్ణయ్య. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది. రీసెంట్ గానే ఆయన రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజికవర్గ సమీకరణాలతో ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *