ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీ నేరాలకు కూడా రాజధానిగా మారిందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో డ్రగ్స్ నేరాలు 350 శాతం పెరిగాయన్నారు. మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీదే మొదటి స్థానమన్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు.
బాంబు బెదిరింపుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ శాంతిభద్రతలపై తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్యను వివరించేందుకు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. భారత్‌లోని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే అత్యధికంగా నేరాలు జరుగుతున్నాయని విమర్శించారు. నేరాల కారణంగా ఢిల్లీకి ‘రేప్ క్యాపిటల్’, ‘క్రైమ్ క్యాపిటల్’ అనే కొత్త పేర్లు వస్తున్నాయన్నారు.