ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి పలువురు వైసిపి నేతలపైన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు విచారణకు రావాలని 41 ఏ నోటీసులను ఇచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు
గతంలో దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ చేసిన తీవ్ర వ్యాఖ్యలపైన జనసేన కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేశారు.
ఇక తనకు నోటీసులు ఇవ్వడం పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తమకు ఎన్ని నోటీసులు ఇచ్చిన భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తన మీద జనసైనికులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలేవి?
తాను గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశానని తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టిన పోలీసులు టిడిపి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు తనను దుర్భాషలాడుతూ తిడుతూ పెట్టిన పోస్టుల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తన కారును తగలబెడతామని, తనను చంపేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు.
సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు
జనసేన కార్యకర్తల బెదిరింపులపై తాను సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని దువ్వాడ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలిపెట్టారని ఆరోపించారు. ఇక రెండు సంవత్సరాల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు మాత్రం పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇంతకు ఇంతా తిరిగి చెల్లిస్తాం
ఇక తనను మాత్రమే కాదు దివ్వల మాధురిని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఆమె పైన అనుచిత పోస్టులు పెడుతున్నారని ఆమె రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి ఇంతకు ఇంత తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.
న్యూటన్ లా చెప్పిన దువ్వాడ
దువ్వాడ శ్రీనివాస్ న్యూటన్ చెప్పినట్లు చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో కూటమి పార్టీ చర్యలకు తమ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.