శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతుల ‘దిల్లీ చలో’ భగ్నం చేసిన పోలీసులు..

రైతు డిమాండ్లు సాధించుకునేందుకు దిల్లీ వైపు వెళ్లాలని చూస్తున్న రైతులు.. వారిని అడ్డుకునే భద్రతా బలగాల ప్రయత్నాలతో హరియాణా- పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలు దక్కేలా.. మద్ధతు ధరల చట్టం చేయాలనే డిమాండ్ తో పాటు మరో 11 డిమాండ్ల సాధనకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తున్నారు. వీరంతా దిల్లీని చేరేందుకు ప్రయత్నించగా.. వారిపై పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించారు.

 

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నెలల తరబడి ధర్నా కొనసాగిస్తున్న రైతులు.. శనివారం మధ్యాహ్నం సమయంలో “దిల్లీ చలో” మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనీస మద్ధతు ధర చట్టంతో సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్ చేపట్టారు. కాగా.. వీరిని అడ్డుకునేందుకు బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు.. ఆ తర్వాత నీటి ఫిరంగులతో రైతుల్ని చెదరగొట్టారు. దీంతో.. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

సరిహద్దుల్లో నెలల నుంచి ఉన్న రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా దిల్లీలో ధర్నా చేపట్టాలనే లక్ష్యంగా మార్చ్ నిర్వహించారు. అయితే.. భద్రతా కారణాలు, దేశ రాజధానిలోకి ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు.. వారిని సరిహద్దుల్లోనే నిలువరిస్తున్నారు.

 

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా నిలిపివేసింది. శనివారం ఉదయం నుంచి 17వ తేది అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేెట్ కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వేగంగా ఇతర ప్రాంతాలకు తెలియడంతో పాటు మరింత ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతాయని భావిస్తున్నారు.

 

రైతుల నిరసన, భద్రతా బలగాల నిలువరింపుల మధ్య రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ స్పందించారు. దేశంలోని రైతులంతా ఈ ఉద్యమం ద్వారా వచ్చే ప్రయోజనాలతో లాభపడతారని, కానీ ప్రధాని ఈ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు సైతం దీని గురించి ఏం మట్లాడడం లేదని అన్నారు. కాగా.. ఈ విషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రైతుల్ని అడ్డుకున్న తీరు సరిగా లేదని విమర్శిస్తోంది. రైతులు ధర్నా చేస్తోంది.. భారత్ లోనా లేక పాకిస్థాన్ సరిహద్దుల్లోనా అని కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పునియా ప్రశ్నించారు. రైతుల్ని అడ్డుకోవడం లేదని చెబుతూనే వారిపై భాష్పవాయు గోళాలను, నీటి ఫిరంగుల్ని ప్రయోగిస్తున్నారు అన్నారు. రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఆయన శంభు సరిహద్దులకు చేరుకున్నారు.

 

శుంభూ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా మరోమారు రైతు ఉద్యమంపై చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో రైతులపై నీటి ఫిరంగులను ప్రయోగించడాన్ని.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రైతులపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. లేదని రైతులపై దౌర్జన్యంగా ప్రవర్తించడం మంచిది కాదని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *