ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఎస్సీ కులాలకు అన్యాయం చేయనని, రిజర్వేషన్ల విషయంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనని తెలిపారు. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో గ్లోబల్ మాదిగ డే – 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఓ వర్గం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా.. ఇటీవల సుప్రీం కోర్టు నుంచి సానుకూల తీర్పు వెలువడింది. దానిని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులోని మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మాదిగ కుల ఉపకులాల రిజర్వేషన్లపై స్పష్టమైన విధానాన్ని తెలియజేసిందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎన్నికల సమయంలోనే తమ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు దానంతట అదే రాలేదని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాదిగలకు అనుకూలంగా తీర్పు రావటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించి వాదనను వినిపించినట్లు తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు విలువరించటంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదిక ప్రకటించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ సమస్యలానే ఎస్సీ వర్గీకరణ సమస్యను జఠిలంగా మారిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
తరాలుగా మాదికలు ఆకాంక్షిస్తున్నట్లుగా రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో న్యాయం ఉందని.. వారికి న్యాయం చేయాలని ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ మొదలుపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా వర్గీకరణను అమలు చేసేందుకు చేపట్టాల్సిన విధివిధానాలు పై అధ్యయనం చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని, అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినట్లు తెలియజేశారు. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యూడిషియల్ కమిషన్ సైతం నియమించినట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని, దాని ఆధారంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం మాదిగ కులస్తులు అడగకుండానే ప్రభుత్వంలో మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం పేషీలో ఆ సామాజిక వర్గం వాళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే డాక్టర్ సంగీతను నియమించినట్లు తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఎన్నడూ లేనివిధంగా వైస్ ఛాన్స్ లర్ గా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించినట్లు తెలిపారు. IIT వీసీగా, విద్యా కమిషన్ మెంబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామంటూ ప్రకటించారు.