ఈ వైసీపీ నేత అరెస్ట్‌ తప్పదా..?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత పేర్నీ నానికి నెమ్మదిగా కష్టాలు మొదలైనట్లే కనిపిస్తున్నాయి. అసలే అధికారం కోల్పోయి బాధల్లో ఉన్న పేర్నీ నానికి, ఇప్పుడు మరిన్ని ఇతర చిక్కులు ఎదురవుతున్నాయి. పైగా.. మొత్తం ఫ్యామిలీ పోలీసు కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు రావడంతో.. నాని కంగారు పడుతున్నారని టాక్. ఈ కారణంగానే.. ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో కుటుంబంతో గడుపుతున్నారంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

 

పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో మచిలీపట్నంలో గోదాములు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు లీజు ప్రాతిపదికన అప్పగించారు. దాంతో.. పౌరసంబంధాల శాఖ ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని ఈ గోదాముల్లో ప్రభుత్వ నిల్వ చేస్తుంటుంది. భారీ స్థాయిలో నిల్వ ఉండే బస్తాల్లో ఇటీవల తనిఖీలు నిర్వహించగా.. అవకతవకలు బయటపడ్డాయి.

 

అసలే కూటమి ప్రభుత్వం, ఆపై జనసేనా కీలక నేత మనోహర్ దగ్గర ఉన్న శాఖ కావడంతో నిఘా ఎక్కువగా ఉంది. పైగా.. వైసీపీ నేతలు బియ్యం దందా చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరికోరి.. ఆ శాఖను తన కీలక మిత్రుడికి అప్పగించారు. ఇటీవలే విశాఖలో సముద్రంలోకి వెళ్లి మరీ అక్రమ బియ్యం సరఫరాను అడ్డుకున్న పవన్.. రాష్ట్రంలో అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న నాయకులపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. దాంతో.. పేర్ని నాని సైతం అడ్డంగా బుక్కయ్యారు.

 

పేర్ని జయసుధకు చెందిన గోదాములో ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యంలో ఏకంలో 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి. విషయం గుర్తించిన పౌరసరఫరాల శాఖ అధికారులు మచిలీపట్నం తాలూగా స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గోదాము యజమానిగా ఉన్న జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపై అధికారులు ఫిర్యాదు చేశారు. దాంతో.. అరెస్ట్ తప్పదని బావించిన పేర్నీ నాని.. కుటుంబంతో సహా కనిపించకుండా పోయారనే టాక్ నడుస్తోంది. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియాకు కానీ, ఇతరులకు కనిపించలేదు. అసలు.. జిల్లా క్యాడర్ కే అందుబాటులో లేరంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చంటున్నారు.. ఆయన ప్రత్యర్థులు.

 

పేర్నీ నాని పరారయ్యారా..?

రేషన్ బియ్యం మాయం కేసులు అరెస్ట్ తప్పదని భావించిన పేర్ని జయసుధ.. మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను, తన సిబ్బందిని అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. పేర్నీ కుటుంబంతో పాటుగా గోదాము మేనేజర్ మానస్ తేజ సైతం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్.. రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ పార్టీ తరఫున నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ.. పేర్ని నాని జిల్లా అధ్యక్షుడి హోదాలో పాల్గొనాల్సి ఉన్నా… అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తనయుడు బందరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పేర్ని కిట్టు కూడా కనిపించకపోవడంతో.. పేర్ని నాని కుటుంబం పరారైందనే చర్చ నడుస్తోంది.

 

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. అరెస్ట్ తప్పదా..

పేర్ని నాని సతీమణికి సంబంధించిన గోదాములో రేషన్ బియ్యం మాయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో అరికట్టాలనే ఉద్దేశ్యంతో ఎంత పెద్ద నాయకులు ఉన్నా.. కఠినంగా వ్యవహరించాలనే పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. పైగా.. జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ కు తిట్టాలంటే ముందు పేర్ని నానినే కనిపించే వాళ్లు. నోటితోనే కాకుండా సైగలు చేస్తూ సైతం పవన్ పై పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మార్లు బహిరంగ సభల్లో పవన్ పేర్నికి డైరెక్ట్ వార్నింగులు ఇచ్చిన సందర్భాలున్నాయి. దాంతో.. అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్కైన నానికి చిక్కులు తప్పవనే అంటున్నాయి జిల్లా రాజకీయల గురించి తెలిసిన వాళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *