వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులపై దశాబ్దం క్రితం దాఖలైన ఆస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని, అలాగే ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ సంచలనాలు రేపుతోంది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇప్పటివరకూ జగన్ ఆస్తుల కేసుల అప్ డేట్ ఇవ్వాలని సీబీఐ, ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రెండు సంస్ధలు తమ నివేదికలు సమర్పించాయి.
వీటిలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో సీబీఐ పేర్కొంది. ముఖ్యంగా కింది స్ధాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ దాఖలైన 125 పిటిషన్లే ఇందుకు కారణమని తెలిపింది. ఇందులో డిశ్చార్జ్ పిటిషన్లే ఎక్కువగా ఉన్నాయి. జగన్ పై నమోదైన 11 కేసుల్లో 120 ఛార్జిషీట్లు వేశామని తెలిపిన సీబీఐ.. 861 మంది సాక్ష్యులుగా ఉన్నట్లు వివరించింది.
అలాగే ట్రయల్ కోర్టుల్లో వీటిపై 86 పిటిషన్లు దాఖలయ్యాయని, ఇవన్నీ విచారణకు నోచుకోక పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఒక్క జగన్ దాఖలు చేసిన 11 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది. అలాగే హైకోర్టులో 40 పిటిషన్లు దాఖలైతే వాటిలో 27 పెండింగ్ లో ఉన్నట్లు సీబీఐ తెలిపింది. సుప్రీంకోర్టులో సైతం 15 పిటిషన్లు దాఖలైతే అందులో 12 పెండింగ్ లో ఉన్నట్లు సీబీఐ వివరించింది. దీన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.