తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చరిత్రలో మొదటి సారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు తయారు చేయిస్తున్నారు.
గురువారం సచివాలయంలో మహిళా సంఘాల కోసం తయారు చేస్తున్న చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వాటిని మంత్రికి చూయించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యూనిఫాం చీరలను ఫైనలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేస్తారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా వీరికి పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరల ఎంపిక కూడా పూర్తవుతోంది. మంత్రి సీతక్కకు పలు రకాల చీరలను పరిశీలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చే చీరలకు సంబంధించి పలు సూచనలు చేశారు సీతక్క.