తెలంగాణాలో భూదాన్ భూముల కేసు కొత్త మలుపు..

తెలంగాణాలో భూదాన్ భూముల కేసు కొత్త మలుపు తిరుగుతోందా? స్కామ్ వెనుక అప్పటి బీఆర్ఎస్ నేతలున్నారా? మరో నలుగురికి ఈడీ ఎందుకు నోటీసులు ఇచ్చింది? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డికి సంబంధమేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతున్నాయి.

 

తెలంగాణ భూదాన్ భూముల కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ స్కామ్‌లో అప్పటి కలెక్టర్ ఐఏఎస్ అమోయ్‌కుమార్ విచారించింది ఈడీ. ఆయన నుంచి విచారణ మొదలుపెట్టిన ఈడీ, దిగువస్థాయి అధికారులు ఆర్డీఓ, తహశీల్దార్ ఇలా అందర్నీ పిలిచి విచారణ చేపట్టింది. వారి నుంచి కీలక సమాచారం తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

 

వివరాలన్నీ క్రోడీకరించిన తర్వాత తాజాగా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. వారిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు బిల్డర్లు ఉన్నారు. వారిలో వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించింది.

 

ఆమోద డెవలపర్స్ కు చెందిన సూర్య తేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్‌కు చెందిన సిద్ధారెడ్డి ఇందులో లాభ పడినట్లు గుర్తించింది ఈడీ. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి నుంచి సమాచారం తీసుకున్న తర్వాత మరికొందర్ని విచారణకు పిలిచే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 50 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతం కావడంపై విచారణ చేస్తోంది ఈడీ. సర్వే నెంబర్ 181, 182 లోని 100 ఎకరాల భూమిపై కొంతకాలంగా వివాదం నలుగుతోంది. అందులో 50 ఎకరాలు భూమిని భూదాన్ బోర్డుకు చెందినదిగా వాదిస్తోంది సంబంధిత బోర్డు.

 

కాల క్రమేణా ఆ భూములు చేతులు మారుతూ వచ్చింది. చివరకు 2021లో హజీఖాన్ వారసురాలిని తానేనంటూ ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసుకోవడం, ఆమెపై భూములు రిజిస్ట్రేషన్ జరిగి పోవడం చకచకా జరిగిపోయింది. అనేక మలుపులు తిరిగిన ఈ ల్యాండ్ వ్యవహారం చివరకు న్యాయస్థానం వరకు చేరింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు అయ్యింది.

 

దీని ద్వారా ఎవరెవరు లబ్ది పొందారు అనేదానిపై కూపీ లాగింది ఈడీ. అప్పటి కలెక్టర్ మొదలు ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు స్థాయి అధికారులను విచారించింది. అందులో కొందరు అధికారులు మహిళకు అనుకూలంగా పని చేసినట్టు ఈడీ గుర్తించింది. ఆ తర్వాత ఆయా భూములు రియల్ ఎస్టేట్ కంపెనీల చేతికి వెళ్లినట్టు తేలింది.

 

ఇందుకు భారీగా ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగేసింది. కలెక్టర్ మొదలు దిగువ స్థాయి అధికారులను పిలిచి విచారించిన విషయం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌రెడ్డితోపాటు రియల్‌ఎస్టేట్ బిల్డర్లను విచారిస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయో? దీని వెనుక అసలు సూత్రధారులు బయటపడతారా, లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *