ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేక చట్టం ఉంటుందా.. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హీరో అల్లు అర్జున్ హడావుడి చేశారంటూ బన్నీ అరెస్ట్ పై మరోమారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మహనీయులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు. గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లు ఎందుకు అరెస్ట్ అయ్యారంటూ సీఎం ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. అటువంటి సంధర్భంలో పోలీసులు కేసు నమోదు చేయడం తప్పు ఎలా అవుతుందంటూ సీఎం అన్నారు.
ఘటన జరిగిన పది రోజుల తర్వాత పోలీసులు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారన్నారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేక చట్టం ఏముండదన్న విషయం అందరికీ తెలిసిందే అంటూ సీఎం వ్యాఖ్యానించారు. జనం ప్రాణాలు పోతున్నా, కేసులు పెట్టొద్దన్న వాదనను పలువురు తెరపైకి తీసుకురావడం తనకు ఆశ్చర్యకరంగా ఉందంటూ సీఎం స్పందించారు. ఘటన జరిగిన సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లి ఉంటే, ఇంత సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్నారు సీఎం. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేయడంతో, తొక్కిసలాట జరిగి మహిళ ప్రాణం పోయిందంటూ.. ఆ ఘటనపై సీఎం రియాక్ట్ అయ్యారు.
ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా పోలీసులు పేర్కొన్నారని, చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తనకు తెలుసన్న సీఎం, బన్నీకి కూడా తాను తెలుసన్నారు. అంతేకాదు అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అంటూనే, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతనే అన్నారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి తనకు బంధువని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. హోం శాఖ తన వద్ద ఉన్న నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ తనకు పూర్తిగా తెలుసంటూ సీఎం అన్నారు.
సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించుకున్నారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదంటూ సీఎం కీలక కామెంట్స్ చేశారు. ఇదే ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి కూడా సీఎం ఓపెన్ అయ్యారు. తన ఫేవరెట్ హీరో కృష్ణగా తెలిపి.. ఆయన ఇప్పుడు లేరంటూనే కృష్ణ నటించిన సినిమాల గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ అందరికీ ఉంటారని, కానీ మనం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాలన్నారు. నేను కూడా పొలిటికల్ స్టార్ నే కదా.. నాకూ ఫ్యాన్స్ ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అయితే ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పలు కామెంట్స్ వైరల్ గా మారాయి.