తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు అధికారులపై సీరియస్ అయ్యారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ లో గల ఓ రైతుకు బేడీలు వేసి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని సీఎంఓ అధికారులకు సీఎం ఆదేశించారు.
వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించి, భూ సేకరణ విషయమై గ్రామానికి వచ్చిన కలెక్టర్‌పై దాడికి యత్నించడం అప్పుడు సంచలనంగా మారింది. లగచర్ల దాడి ఘటనలో 45 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, సంగారెడ్డి జైలులో రిమాండ్ నిమిత్తం ఉంచారు. అయితే జైలులో ఉన్న ఓ రైతుకు గుండెనొప్పి రాగా అధికారులు వైద్యశాలకు తరలించారు. అలా వైద్యశాలకు తరలించే క్రమంలో రైతు చేతికి బేడీలు వేసి తరలించడంపై విమర్శలకు తావిస్తోంది.
హీర్యా నాయక్ అనే రైతు హార్ట్ అటాక్ కు గురికాగా, జైలు అధికారులు వెంటనే అతడిని వైద్యశాలకు తరలించారు. వైద్యశాలకు తరలించడం వరకు ఓకే గాని రైతును పోలీస్ జీపులో బేడీలు, గొలుసులతో కట్టి వేయడం అందరిని ఆశ్చర్యకితులను చేసింది. ఆయన రైతు.. అందులోనూ గుండె నొప్పితో భాద పడుతున్నాడు. అయినా కూడా బేడీలు వేయాల్సిందేనా అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని సీఎం సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారుల నుండి వివరాలను ఆరా తీసిన సీఎం, వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తమ ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో అప్పటికప్పుడు అధికారులు వైద్యశాలకు వెళ్లి, ఆ రైతు క్షేమ సమాచారాలు తెలుసుకొనేందుకు క్యూ కట్టడం విశేషం.