ఏపీ ఐఏఎస్ లకు పవన్ కళ్యాణ్ క్లాస్..!

మీ పని మీరు చేస్తే చాలు.. మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని సీఎం చంద్రబాబు అధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని, పలు కీలక కామెంట్స్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి గోకులలను తీసుకురావడం అభినందనీయమని, సీఎం చంద్రబాబు నాయకత్వపు లక్షణాలకు ఇది నిదర్శనమన్నారు. అలాగే సీఎం చంద్రబాబు గొప్ప విజన్ తో పాలన సాగిస్తుంటే, అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజలకు ఇబ్బందులని తొలగించాలని కూటమి కట్టామని తెలిపారు.

 

తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చాయని, ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. రెవెన్యూ అధికారుల ద్వారా సినిమా టిక్కెట్లు అమ్మించడం, ఇసుక దోపిడి, ఇంకా అనేక అక్రమాలు కూడా అధికారుల ద్వారా సాగించిందని తెలిపారు.

 

తాము అధికారంలో లేనప్పుడు సామన్యుడిలా బయట నుండి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంత మంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పక పోవడం ఏమిటన్నారు. దీని వల్లనే నేడు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉందని పవన్ అన్నారు.

 

తమ పార్టీ కార్యాలయానికి వచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మొన్నీమధ్య సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేసారన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి, మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అనడం విశేషం.

 

అది కలెక్టర్ల బాధ్యత కాదా ? ఎస్పీ బాధ్యత కాదా ? ఎలా వదిలేశారు ? చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నిస్వార్థంగా ప్రజలకోసం తాము పని చేస్తున్నా మీ సహకారం ఉండట్లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పవన్ సూచించారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు సీఎం చంద్రబాబు వింటూ సైలెంట్ గా ఉండిపోవడం చూస్తే, వారిద్దరి మధ్య ఉన్న మైత్రి బంధానికి నిదర్శనంగా పార్టీ క్యాడర్ చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *