రేషన్ గోడౌన్ లో గోల్ మాల్.. మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు..

మాజీ మంత్రి పేర్ని నాని ఇక చుక్కలేనా.. ఆయన సతీమణిపై కేసు నమోదు కాగా, పోలీసులు అసలు విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఇంతకు ఏంటా కేసు? అసలేం జరిగిందో తెలుసుకుందాం.

 

వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు పేర్ని నాని. అధికారంలో ఉన్న సమయంలో సైతం మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు నాని. అధికారంలో ఉన్న సమయంలో సూటి విమర్శలతో నిరంతరం వార్తల్లో నిలిచేవారు ఈయన. ప్రస్తుతం అధికారం కోల్పోయింది వైసీపీ. అధికార పక్షంలో ఉన్న కూటమిపై నాని విమర్శలు మాత్రం అదే రీతిలో సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన నాని, రాజకీయ విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. అలాగే వైసీపీ లక్ష్యంగా ఎవరైనా విమర్శలు చేశారంటే చాలు.. ముందు మీడియా ముందు వాలిపోయేది కూడా ఈయనే.

 

అటువంటి పేర్ని నానికి భారీ షాక్ తగిలింది. ఏకంగా నాని సతీమణిపై కేసు నమోదు కాగా, ఆ కేసు కూడా రేషన్ బియ్యంకు సంబంధించి కావడం విశేషం. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేరిట బందరు పట్టణంలో ఓ గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ ను 2020 లో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం లీజుకు తీసుకుంది.

 

ఇక్కడ సివిల్ సప్లై శాఖ పరిధిలోని రేషన్ బియ్యంను నిల్వ ఉంచుతారు. అయితే ఇటీవల జరిపిన తనిఖీలలో, గోడౌన్ లో గల సుమారు రూ. 90 లక్షల విలువైన రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం పై సివిల్ సప్లై అధికారులు సీరియస్ అయ్యారు. మాయమైన బియ్యానికి రెండింతలు అంటే, ఒక కోటి 80 లక్షల రూపాయలు చెల్లించాలని సివిల్ సప్లై శాఖ సీఎండీ ఆదేశాలు జారీ చేశారట.

 

ఇది ఇలా ఉంటే పేర్ని నాని నవంబర్ 27వ తేదీన జేసీకి గోడౌన్ కు సంబంధించి లేఖ రాశారు. తమ గోడౌన్ కు 3200 బస్తాల మేర తరుగు వచ్చిందని అధికారులకు నాని ఫిర్యాదు చేశారు. ఆ తరుగు సంబంధించిన బియ్యానికి వెలకట్టి తాను మిగిలిన డబ్బులు చెల్లిస్తానని లేఖ రాశారని సమాచారం. ఆ లేఖతో రంగంలోకి దిగిన అధికారులు అసలు చిట్టా బయటకు తీశారట. రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ గత నెల చివరన, ఈ నెల మొదటి వారంలో తరుగును వెలకట్టారు.

 

దీని విలువ దాదాపు 89 లక్షల 72 వేలుగా తేల్చారు. ఇప్పటిదాకా 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని కూడా వారు ప్రకటించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి అధ్వర్యంలో విచారణ కొనసాగించి నివేదికను సంబంధిత అధికారులకు అందజేశారు. అలాగే ఫిర్యాదు కూడా చేయడంతో నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *