ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ ఆసక్తి కరంగా మారింది. ఈ సమావేశంలో రాధాకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం.
తాజా నిర్ణయాలతో
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి.. మూడు పార్టీల్లోని ముఖ్యులకు పదవుల పైన హామీలు ఇచ్చారు. ఇప్పటికి రెండు జాబితాలను ప్రకటించారు. మూడో లిస్టు పైన కసరత్తు జరుగుతోంది. ఇటు రాజ్యసభ .. ఎమ్మెల్సీ పదవుల పైన పలువురు ఆశలు పెట్టుకున్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు తాజాగా ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసారు. బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య కు దక్కగా, మిగిలిన రెండు స్థానాలు టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేసారు.
కూటమిలో పోటీ
అదే విధంగా ఎమ్మెల్సీ సీట్ల పైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసారు. వారి రాజీనామాల పైన ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆమోదం పొందితే కొత్తగా ఇవ్వాల్సిన లిస్టు పైన చంద్రబాబు, పవన్ కసరత్తు చేయనున్నారు. ఇదే సమయంలో నాగబాబును మంత్రిగా తీసుకోవాలనే నిర్ణయంతో ఎమ్మెల్సీ సీటు ఇప్పుడు నాగబాబు కు ఒకటి రిజర్వ్ చేయాల్సి ఉంది. ఇక, రాజ్యసభ కోసం చివరి దాకా ప్రయత్నించిన పలువురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి బుజ్జగించేలా కసరత్తు కొనసాగుతోంది. అదే విధంగా మార్చి లో మరో నాలుగు సీట్లు మండలిలో ఖాళీ కానున్నాయి.
రాధాకు మరోసారి
ఇక, వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో, టీడీపీ లో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేసారు. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో హామీ అమలు కాలేదు. 2024 ఎన్నికల్లోకూ కూటమికి మద్దతుగా రాధా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు తో సమావేశంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో ఒకటి రాధా కు ఇచ్చేలా హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో..త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.