ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. సీఆర్డీయే చేపడుతున్న 20 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం కానుంది.
కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణాలతో ఈ పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల బంగ్లాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లు, సెక్రటేరియట్ టవర్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశారు.
ఇక, రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసేందుకు కూడా నిధులు కేటాయించారు. శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1.585 కోట్లు కేటాయించారు. హ్యాపీ నెస్ట్ అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం రూ.984 కోట్లు మంజూరు చేశారు.
వరద నీటి కాలువలు, డ్రెయినేజి వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థలు, సీనరేజి, యుటిలిటీ డక్ట్స్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కోసం నిధులు మంజూరు చేశారు.