తెలంగాణ తల్లి రూపాన్ని వక్రీకరిస్తే నేరమే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా ‘తెలంగాణ తల్లి’ ఉండాలని భావించి ఆమోదించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆమోదించిన రోజైన డిసెంబర్ 9 తేదీన ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం’గా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించింది.

 

కుడి చేతితో అభయం.. ఎడమ చేతిలో పంటలు

తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంఠ, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్యవయస్సు స్త్రీమూర్తిలా హుందాగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించినట్టు ప్రభుత్వం వివరించింది. కుడిచేతితో అభయాన్ని, ఎడమచేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించినట్టు వెల్లడించింది.

 

వక్రీకరిస్తే నేరమే

‘తెలంగాణ తల్లి’ విగ్రహం జాతి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, మరో కోణంలో చూపించడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో గానీ, ఇతర ప్రదేశాలలో గానీ, లేదా ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాలలో మాటలు లేక చేతలతో అగౌరవపరిచినా, ధ్వంసం చేసినా, కాల్చడం, అవహేళన చేయడం, కించపరచడం వంటి చర్యలను నేరంగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *