ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు.. ప్రభాకర్‌ పై హరీష్ రావు ఒత్తిడి.. అఫిడవిట్‌లో సంచలన నిజాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన ఈ కౌంటర్ అఫిడవిట్‌లో కీలక విషయాలు పొందుపరిచారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నలుగురు నిందితులు బేగంపేట ఎస్ఐబీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు పోలీసులు. బేగంపేట హరిత ప్లాజా, మ్యారీ గోల్డ్ హోటల్, జూబ్లీహిల్స్‌లోని శ్రవణ్ రావు ఇంట్లోనూ పలు అంశాలపై చర్చించేందుకు వీరు భేటీ అయ్యారని వివరించారు.

 

బీఆర్ఎస్ సర్వేతో కథంతా తారుమారు

ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో 50 సీట్లు కూడా దాటవని తేలింది. ఇదే విషయాన్ని ప్రభాకర్ రావుతో శ్రవణ్ శ్రవణ్ రావు చర్చించాడు. దీంతో బీఆర్ఎస్ ప్రత్యర్ధులపై ఫోకస్ పెరిగింది. వాళ్లకు చేరే డబ్బుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో నిఘాను పెంచారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఎస్ఐబీ డేటాను ధ్వంసం చేయాలని కుట్రకు తెరతీశారు. ఈ విషయాన్ని రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తెలిపారని చెప్పారు పోలీసులు.

 

ఆధారాల ధ్వంసం కోసం టెక్నాలజీ వాడకం

వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వాట్సాప్ డేటా, కాల్స్, ఫోన్‌లోని యాప్స్, గ్యాలరీ వీడియోలు, ఫోటోలు తొలిగించడం ఎలాగో తెలుసుకున్నారు. అలా తమ ఫోన్లను, ట్యాబ్‌లను, పర్సనల్‌ ల్యాప్‌టాప్‌లను ఫార్మాట్‌ చేశారని పోలీసులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఐబీలోని హార్డ్‌డిస్క్‌లను, పెన్‌డ్రైవ్‌లను, పత్రాలను, డైరీలను, ప్రింట్‌ అవుట్లను ధ్వంసం చేయడంపైనా నిందితులంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. రాజకీయ నిఘా కోసం శ్రవణ్‌ రావుతో తరచూ సంప్రదింపులు జరపాలని ప్రభాకర్‌ రావుపై హరీష్ రావు ఒత్తిడి చేశారని చెప్పారు.

 

బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీచేసే ప్రత్యర్థుల ఫోన్‌ నెంబర్లపై నిఘా ఉంచాలని శ్రవణ్‌ రావు సూచించాడు. అతను, తన బృందంతో ప్రొఫైళ్లను తయారు చేసి నిఘా ఉంచాడని పేర్కొన్నారు. ఆ ఫోన్‌ నెంబర్లలో సాగే సంభాషణలను రహస్యంగా విని సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్‌ రావుతోపాటు శ్రవణ్‌ రావుకూ ప్రణీత్‌ రావు చేరవేశాడు. ప్రణీత్‌ మూసీ నదిలో పడేసిన హార్డ్‌డిస్క్‌లు గతంలో ఎస్‌ఐబీలో వినియోగించినవే అని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్దారణ చేసింది. మూసీలో దొరికిన హార్డ్‌డిస్క్‌ సీరియల్‌ నెంబర్ల ఆధారంగా ఇవి ఎస్‌ఐబీకి చెందినవే అని ఫిక్స్ అయినట్టు వివరించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *