దేశంలో బ్యాంకులకే బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త గవర్నర్ గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ఆర్ధికశాఖలో రెవెన్యూ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంజయ్ మల్హోత్రాను తదుపరి ఆర్బీఐ గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఎల్లుండి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1990 బ్యాచ్ రాజస్దాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ మల్హోత్రా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్ విద్యార్ది. 1989లో బీటెక్ కంప్యూటర్స్ సైన్స్ పట్టా తీసుకున్నారు. అనంతరం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పూర్తి చేశారు. గతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శిగా కూడా సంజయ్ పనిచేశారు. రెవెన్యూ కార్యదర్శిగా పన్ను వసూళ్లను పెంచడంలోనూ, జీఎస్టీ రూపురేఖలు మార్చడంలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. విద్యుత్, ఆర్ధిక, పన్ను విధింపు, ఐటీ, మైనింగ్ రంగాల్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న అనుభవం ఆయనకు ఉంది.
రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడంలో సంజయ్ ది కీలక పాత్ర. కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసిన సమయంలో సంజయ్ మల్హోత్రా డిస్కంల ప్రైవేటీకరణతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. 2020లో ఆర్ఈసీ ఛైర్మన్, ఎండీగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న శక్తికాంత దాస్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో ప్రస్తుతం ఆర్ధికశాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ఇవాళ కేబినెట్ నియామకాల కమిటీ ఆర్బీఐ కొత్త గవర్నర్ గా ఎంపిక చేసింది. ఆర్బీఐకి 26వ గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు.