తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. జాతికే గర్వమన్న సీఎం రేవంత్ రెడ్డి..

యావత్ తెలంగాణ గర్వించిన వేళ.. ఆ తల్లి రూపం విద్యుత్ కాంతుల వెలుగులో విరాజిల్లిన వేళ.. తెలంగాణ సమాజం ఆ తల్లి ఆశీస్సులు పొందిన వేళ.. అమరులైన వారి త్యాగాలు మదిలో మెదిలి.. జయహే తెలంగాణ అంటూ నినదించిన వేళ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సంబరంగా జరగగా, యావత్ తెలంగాణ పులకించింది. ఆ తల్లి దీవెనలు అందుకుంది.

 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయోత్సవాల ముగింపు రోజు హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తల్లి విగ్రహావిష్కరణ కాగానే, జై తెలంగాణ తల్లి అంటూ ప్రజలు హోరెత్తించారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ సంధర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా.. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలలో కళాకారుల ప్రదర్శనలు సాగుతుండగా, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి.

 

తెలంగాణ తల్లి రూపం రూపు రేఖలు ఇలా..

తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంఠ, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించబడి, కుడిచేతితో అభయాన్నిస్తూ, ఎడమచేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించబడ్డాయి.

 

తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి, తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం గాని, వేరేవిధంగా చూపించడం గాని నిషేధించడమైనది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో గాని, ఇతర ప్రదేశాలలో గాని, ఆన్ లైన్లో గాని, సామాజిక మాధ్యమాలలో గాని, మాటలు లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించబడుతుందని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అలాగే ఇకముందు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీనాడు, రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణతల్లి అవతరణ ఉత్సవం”గా రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగినవిధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

తెలంగాణ ప్రజల అస్తిత్వం ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక జీవన రూపము, తల్లి ఆశీర్వాదము అన్ని కలగలిపిన నిండైన రూపం తెలంగాణ తల్లి రూపంను చూసిన ప్రజానీకం జయహే జయహే తెలంగాణ అంటూ నినదించారు. అలాగే ముగింపు వేడుకల సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందెశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డి లను వేదిక మీద ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మేల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *