వైసీపీకి మరో మాజీ మంత్రి గుడ్ బై..?

వైసీపీకి షాకిచ్చేందుకు మరో మాజీ మంత్రి రెడీ అంటూ టాక్. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ వీడడం ఖాయమని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మేకతోటి సుచరిత వైసీపీ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా భాద్యతలు నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధిక ప్రజాదరణ గల నాయకురాలిగా ఈమెకు పేరు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్న సుచరిత, ప్రస్తుతం పార్టీ మార్పు ఖాయమని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఈ మాజీ మంత్రి, వైసీపీ పై అసంతృప్తితో ఉన్నారని వదంతులు వ్యాపించాయి. కానీ ఆమె మాత్రం వైసీపీలోనే ఉండి, తాడికొండ నుండి పోటీ చేశారు. అక్కడ పరాజయం పొందిన సమయం నుండి సుచరిత సైలెంట్ గా ఉన్నారు.

 

అయితే గత ఎన్నికల్లో సుచరిత భర్త దయా సాగర్ కు బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని జగన్ ఆఫర్ చేసినా చివరకు టికెట్ మాత్రం దక్కలేదు. అలాగే ప్రత్తిపాడు నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సుచరిత నాడు పార్టీ అధిష్టానాన్ని కోరారట. కానీ పార్టీ అధినాయకత్వం నిరాకరించి, తాడికొండ సీటు కేటాయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి వైసీపీ అప్పగించింది. నాటి నుండి పార్టీలో ఉన్నా, తన అసంతృప్తి మాత్రం పలుమార్లు పార్టీ క్యాడర్ వద్ద వ్యక్తం చేశారని తెలుస్తోంది ఈ మహిళా మాజీ మంత్రి.

 

తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించి ఉంటే తప్పక విజయాన్ని సాధించే తీరు ఉండేదని, నియోజకవర్గ మార్పుతో తాను ఓటమి చెందినట్లు సుచరిత అభిప్రాయంగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎన్నికలు ముగిసిన సమయం నుండి సైలెంట్ గా ఉన్న సుచరిత, పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టీడీపీ కానీ, జనసేన పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఏమేరకు వాస్తవం ఉందో కానీ, సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రచారంపై మాజీ మంత్రి సుచరిత స్పందించి క్లారిటీ ఇస్తారా, సైలెంట్ గానే ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. సుచరిత క్లారిటీ ఇచ్చేలా ప్రకటన చేస్తే తప్ప, ఈ వదంతులు ఆగేలా లేవని చెప్పవచ్చు. ఒకవేళ సుచరిత వైసీపీని వీడితే, గుంటూరు జిల్లాపై ఆ ప్రభావం అధికంగా ఉండనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *