ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ అగంతకుడు ఫోన్ చేయగా, పోలీసుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. ఆ పర్యటనలో అక్రమ రేషన్ దందాను వెలుగులోకి తెచ్చారు పవన్. కాకినాడ పోర్టుకు పర్యటన ఖరారు కాగానే, అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అప్పటివరకు కాకినాడ పోర్టు వ్యవహారం అంతగా వెలుగులోకి రానప్పటికీ, పవన్ పర్యటనతో కేంద్రం సైతం పోర్టుపై ప్రత్యేక నిఘా ఉంచింది. కాకినాడ పోర్టు వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ, నిరంతరం వార్తలో నిలుస్తోంది. మొత్తం మీద కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాను పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకురావడంతో సంచలనంగా మారింది.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. అలాగే అసభ్య పదజాలంతో మెసేజ్ లు కూడా రావడంతో, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? బెదిరింపుల వెనుక కాకినాడ పోర్టు వ్యవహారం ఉందా? లేక ఆకతాయి పనా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు భద్రత మరింత పట్టిష్టం చేయాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.