ఏపీలో రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలపై ఫోకస్ మరింత పెంచింది. గత ఐదేళ్లలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం రైతు సమస్యల విషయంలో సీరియస్ గా ఉంటోంది. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల నుంచి ధాన్య కొనుగోళ్లు, మిల్లర్ల నుంచి గిట్టుబాటు ధరల విషయంలో ఆరా తీస్తూ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తున్నారు.

 

వీటి ఫలితంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పెరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నం పెట్టే రైతన్నకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ఆరుగాలం పండించే పంటను రికార్డు స్థాయిలో రైతుల నుంచి సేకరిస్తోందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణ ఏ స్ధాయిలో ఉందో ఆయన గణాంకాలను కూడా విడుదల చేశారు.

 

నిన్నటి వరకు రూ.2,584.62 కోట్లతో 1,61,568 మంది రైతన్నల నుంచి 11,22,699 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఇవాళ రూ.2,678.63 కోట్లతో 1,67,299 మంది రైతుల నుంచి 11,63,510 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వెల్లడించారు. అంటే రూ.94.01 కోట్లతో 5,731 మంది రైతు సోదరుల నుంచి 40,811 మెట్రిక్ టన్నులు సేకరించామని ఆయన తెలిపారు. సేకరించిన ధాన్యానికి కేవలం 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమచేయడం రైతు పక్షపాతి ప్రభుత్వంగా నిలిచిపోయిందని ఆయన చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *