తెలంగాణలో బీజేపీ సర్కార్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు: జేపీ నడ్డా..

భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, తమ పార్టీని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ సర్కారు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ స్వార్థం కోసం అధికారాన్ని వాడుకుంటోందని, అయితే బీజేపీ మాత్రం ప్రజా అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందని అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు ఆనందంగా లేరని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్‌ బలమయ్యాయని నడ్డా వ్యాఖ్యానించారు. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలను కాంగ్రెస్ ముంచేస్తోందని నడ్డా ఆరోపించారు. బీజేపీ త్వరలో మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌ స్టేడియంలో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా ‘6 అబద్దాలు 66 మోసాలు’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలు ముగింపు సందర్భంగా ఈ సభను నిర్వహించారు.

 

‘‘రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేపడుతుందని నడ్డా ప్రకటించారు. ‘‘బీజేపీ ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను చూశారు. వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ మళ్లీ అధికారంలో వస్తోంది’’ అని నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.

 

మోదీ పాలనలో అవినీతి లేదు

మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని, లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని నడ్డా వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీని దేశ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే మొత్తం 13 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే నేతృత్వంలో పార్టీలతో కలిసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. త్వరలో మరో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో రాబోతోంది. బీజేపీ అందిస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గుజరాత్‌లో ఆరోసారి అధికారంలో కొనసాగుతున్నాం. హర్యానా, గోవాలో హ్యాట్రిక్ విజయాలు సాధించాం. అసోం, మణిపూర్ రాష్ట్రాలో రెండో సారి అధికారంలో వచ్చాం. వరుసగా మూడవ ప్రధానమంత్రి అయిన ఘనత మోదీదే. విపక్షాలు బలంగా ఉన్నప్పటికీ మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు’’ అని నడ్డా పేర్కొన్నారు.

 

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే ముప్పు పొంచివుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే పరిస్థితి లేదని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టుగా రుణమాఫీ ఇంకా పూర్తవ్వలేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *