తెలంగాణలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టి-ఫైబర్ తన సేవలను డిసెంబర్ 8న ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం కొనసాగుతున్నది. దశల వారీగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తెలంగాణ ప్రభుత్వం అందించే ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ మాదిరిగా ఉంటుంది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్ వర్క్ తో పాటు ఫోన్, ఓటీటీలను చూసే అవకాశం ఉంటుంది.
తొలిదశలో 2,096 గ్రామాల్లో అమలు
తెలంగాణ ప్రభుత్వం అందించే ఇంటర్నెట్ సౌకర్యం తొలి శదలో భాగంగా నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత మిగతా గ్రామాలకు విస్తరించనున్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏకంగా రూ. 2,500 కోట్లు అందజేసింది. ఈ పథకం కింద గ్రామల్లోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందివ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. టీ-ఫైబర్ సంస్థ ఈ సేవలను అందించనుంది.
రూ.300కే ఇంటర్నెట్ కలెక్షన్
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే ఈ పథకం కింద కేవలం రూ. 300కే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. త్వరలోనే రేటు విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ కలెక్షన్ తీసుకుంటే ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. 20 mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. గ్రామాల్లోని కార్యాలయాలు, స్కూళ్లకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సౌకర్యం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇకపై గ్రామాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ తో అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్ లోని కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్ కానున్నాయి.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యమే లక్ష్యం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే టీ-ఫైబర్ లక్ష్యం అని చెప్పారు టీ ఫైబర్ సంస్థ ఎండీ వేణు ప్రసాద్. టీ ఫైబర్ నెట్ వర్క్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను మానిటర్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 30 వేల ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8న (ఆదివారం) సీఎం రేవంతర్ రెడ్డి మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీ రామ్ పూర్ గ్రామాట్లో టీ ఫైబర్ ట్రయల్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వేణు ప్రసాద్ వెల్లడించారు.