శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తనకు హోమ్ మంత్రి పదవి ఇవ్వాలని బిజేపీతో కుస్తీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గం ఏ పార్టీకి ఏ పదువలు కేటాయించాలో జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో షిండే నమ్మకస్తుడు, శివసేన కీలక ఎమ్మెల్యే భరత్ గోగావలే హోమ్ మినిస్టర్ పదవి కోసం తమ అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండే.. బిజేపీతో చర్చలు చేస్తున్నారని శుక్రవారం రాత్రి మీడియాకు తెలిపారు.
డిసెంబర్ 16 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందే.. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 16 మధ్య మంత్రి పదువు కేటాయింపులు పూర్తయ్యే అవకాశం ఉందని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావలె తెలిపారు.
మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లా మహాడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్య గోగావలె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “ఇంతుకుముందు షిండే ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోం మంత్రిత్వశాఖ కూడా ఫడ్నవీస్ వద్దే ఉంది. శివసేన కూడా ఇప్పుడు అదే రీతిలో మా సాయెబ్ (షిండే) కూడా ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి.. హోమ్ మినిస్టర్ పదవి తనకు కేటాయించాలని అడుగుతున్నారు. చర్చలు కొనసాగుతున్నాయి.” అని అన్నారు.
మీడియా సమావేశంలో ఒక విలేకరి ఆయనకు.. “బిజేపీలో షిండే ఎవరితో చర్చలు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ.. “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వీరిద్దరిదే ఈ విషయాల్లో చివరి నిర్ణయం. అందుకోసం వారితోనే చర్చలు జరుగుతున్నాయి. అయితే శివసేనకు తక్కువ మంత్రిపదవులు కేటాయించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు షిండే నాయకత్వంలోని శివసేనకు దక్కిన మంత్రి పదవులు ఇప్పుడు కూడా కొనసాగుతాయి. కేబినెట్ లో లో పదవుల కేటాయింపు గురించి చర్చలు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని అనుకుంటున్నాను.” అని చెప్పారు.
మహారాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి సహా మొత్తం 43 మంత్రి పదవులున్నాయి. వీరిలో బిజేపీకి 21 పదవులు, శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 10 పదువులు పంచుకున్నట్లు సమాచారం .అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఏక్ నాథ్ షిండే హోమ్ మంత్రి పదవి, అజిత్ పవార్ ఆర్థిక మంత్రి పదవి డిమాండ్ చేయగా.. ఈ రెండు కీలక మంత్రిత్వ శాఖలు దేవేంద్ర ఫడ్నవీస్ తనే తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్ నాథ్ షిండే కు హోమ్ మంత్రిత్వశాఖకు బదులు పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉంది.
ఫుడ్ అండ్ సప్లైస్, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమ శాక, క్రీడా శాఖ, యువత సంక్షేమ శాఖ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మినిస్ట్రీ కావాలని అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ బిజేపీ ఇందులో కొన్ని మాత్రమే ఇచ్చేందుకు అంగీకరిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో మంత్రి పదవులు పేచీ త్వరలోనే తేలనుంది.