పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ వివాదంపై విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్న వేళ ఉభయసభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజ్యసభలో ఇవాళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి కేటాయించిన సీటులో భారీగా 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ లో కలకలం రేగింది. దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ విచారణకు ఆదేశించారు.
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటులో నగదు కట్టలు దొరికిన తర్వాత రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నిన్న సభ వాయిదా పడిన తర్వాత విధ్వంస నిరోధక తనిఖీలు చేపట్టిన భద్రతా అధికారులకు ఈ డబ్బు దొరికింది. ఈ విషయాన్ని ఉపాధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్ కూడా అయిన జగదీప్ ధన్‌ఖర్ ఎంపీలకు వెల్లడించారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీకి ప్రస్తుతం కేటాయించిన సీటు నంబర్ 222 వద్ద భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని ఛైర్మన్ తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు.
రాజ్యసభలో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంపై ఛైర్మన్ విచారణ చేయించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎంపీ పేరు బయటపెట్టకుండా ఉండే బావుండేదని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తన సీటు వద్ద నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంపై స్పందించిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ .. తాను కేవలం 500 నోటు మాత్రమే తీసుకొచ్చానని క్లారిటీ ఇచ్చారు. ఈ నోట్ల కట్టల వ్యవహారం తనకు తెలియదన్నారు. ఈ విషయం తొలిసారి వింటున్నానన్నారు.