లగచర్ల దాడి కేసు ఎంతవరకు వచ్చింది? కేసు ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తోందా? నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టలేక పోతున్నారా? పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చుట్టూ తిరుగుతోందా? పాస్‌వర్డ్ అడిగితే తెలీదు.. మరిచిపోయానంటూ సమాధానాలు వస్తున్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
లగచర్ల దాడి జరిగి దాదాపు నెల కావస్తోంది. నిందితులను అరెస్ట్ చేసినా, సమాచారం రాబట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ కేసు వ్యవహారమంతా కేవలం ఒక్క మొబైల్ చుట్టూనే తిరుగుతోందట. ఈ ఘటనలో కీలక నిందితుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి, సురేష్‌లను ఎప్పుడో అదుపులోకి తీసుకున్నారు.
ఘటన తర్వాత సురేష్ తన ఫోన్‌ను ముక్కలు చేశాడట. పైగా ఆ ఫోన్ పోలీసులకు దొరక్కకుండా దాచి పెట్టాడట. పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకున్నా, ముక్కలైన ఫోన్ గురించి ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. దీంతో మరో ఐదు రోజులు ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐఫోన్ కావడంతో ప్రతీది లాక్ చేసి ఉంటుంది. పోలీసులు పాస్‌వర్డ్ అడిగితే మరిచిపోయానంటూ సమాధానం చెబుతున్నాడట.
ఫోన్ ఓపెన్ అయితే ఈ కేసు గుట్టు అంతా బయటకు వస్తుందని భావిస్తున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటే ఫోన్ ఓపెన్ చేయడం తేలిక అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో పట్నం నరేందర్‌రెడ్డి కస్టడీపై శుక్రవారం కొడంగల్ కోర్టు విచారణ జరపనుంది. పోలీసులయితే ఈ కేసును వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నారట.
దాడి జరిగిన రోజు కీలక నేతలతో పట్నం నరేందర్‌రెడ్డి, సురేష్ మాట్లాడినట్టు కాల్ డేటా ద్వారా తేలింది. ఇద్దరి కాల్ డేటా రికార్డింగ్స్‌ను బయటికి తీసి కోర్టుకు సమర్పించారు కూడా. అయినా కీలక విషయాలపై ఓ అడుగు ముందుకేయలేకపోతున్నారు దర్యాప్తు అధికారులు.
కస్టడీకి తీసుకున్నా పాస్‌వర్డ్ గురించి నిందితులు చెప్పకపోతే తర్వాత ఏంటనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఫోన్ ఓపెన్ చేయవచ్చు కాకపోతే అందులో డేటా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందని ఓ పోలీసు అధికారి మాట. దీంతో లగచర్ల ఘటన కేసు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతోంది.