తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..

పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేయగా, యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

సరిగ్గా డిసెంబర్ 9వ తేదీన, ఆనాటి కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు కాగా, ఆదేరోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం విశేషం. ఈ శుభ సందర్భాన్ని రాష్ట్ర పండుగలా చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సబ్బండ వర్ణాలను కలుపుకుపోవడం మాత్రమే కాదు, అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులను సైతం ఆహ్వానించేందుకు సిద్దమయ్యారు.

 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు ఎంత వరకూ జరుగుతున్నాయో ఆరా తీశారు. సచివాలయంలో భారీ ఫౌంటేన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫౌంటేన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఫౌంటేన్ కు చివరన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. చూపరులను ఆహ్లాద పరిచేలాంటి వాతావరణం సైతం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహావిష్కరణతో పాటు, ప్రజాపాలనా విజయోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.

 

ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను చూస్తే.. ఆ తల్లి దర్శనం కలిగిన వెంటనే మదిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యతతో, పోరాట పటిమ గుర్తుకు రావాల్సిందే. నిండైన రూపంలో దర్శనమిచ్చే తెలంగాణ తల్లి, ఆకుపచ్చ చీరలో శాంతి తత్వాన్ని చాటి చెబుతున్నారు. అంతేకాదు ఎడమ చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకుల, కుడి చేతితో యావత్ తెలంగాణ ప్రజలకు అభయమిస్తున్నట్లు ఉన్న రూపం చూస్తే ముగ్ధులు కావాల్సిందే. అలాగే కొంగు చుట్టుకున్న తల్లి పోరాట పటిమను చాటిచెబుతూ.. శ్రామిక శక్తిని, మన సంస్కృతి సంప్రదాయాన్ని అద్దంపట్టేలా రూపం ఉండడం విశేషం.

 

గత బీఆర్ఎస్ పాలనలో విడుదల చేసిన తెలంగాణ తల్లి నమూనా తెలంగాణ సంస్కృతికి బహు దూరమన్న విమర్శలు నాడు వినిపించాయి. కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చూసిన నెటిజన్స్.. ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ జాతి మొత్తం గర్వపడేలా.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి.. ఆ తల్లి ఆశీర్వాదం పొందండి.. తెలంగాణ జాతి గర్వపడేలా జై తెలంగాణ తల్లి అంటూ గట్టిగా నినదించండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *