ఏపీలో రేషన్ అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు.. వారికి చుక్కలే..!

రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తరచూ రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయం వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బియ్యం అక్రమ దారులకు ఇక చుక్కలేనని చెప్పవచ్చు. కాకినాడ పోర్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన సమయంలో రేషన్ బియ్యం దేశాలకు దాటుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

 

దీనితో ఒక దశలో రేషన్ బియ్యం సరఫరాను నిలిపివేసి, లబ్దిదారులకు డబ్బులు అందజేసే ప్రక్రియ పై సైతం ప్రభుత్వాలు చర్చలు సాగించాయి. కానీ సామాన్య కుటుంబాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న ఆలోచనతో ప్రభుత్వం ఆ విషయంపై వెనక్కు తగ్గిందని సమాచారం. ఎలాగైనా అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ ను ప్రభుత్వం రంగంలోకి దించింది.

 

రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించి, 5 మంది అధికారులను విచారణ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. కాకినాడ పోర్టు అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం నుండి, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ దందాపై సిట్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ మేరకు అక్రమ రవాణా సాగిందో తెలుసుకునే అంశాలపై సైతం సంబంధిత అధికారులతో సిట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

 

కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా ఘటనపై ఇప్పటికే వైసీపీని ఉద్దేశించి కూటమి పార్టీలు విమర్శల జోరు సాగిస్తున్నాయి. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అసలు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడంతో బియ్యం అక్రమదారుల గుండెలు గుభేల్ మంటున్నాయట. నిజాయితీ గల పోలీస్ అధికారిగా పేరుగల వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించడం వెనుక, ఈ తతంగంలో ఎవరి జోక్యం ఉన్నా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *