మళ్లీ ఢిల్లీకి రైతులు-ఐదు కీలక డిమాండ్లు-యూపీ బోర్డర్ క్లోజ్..!

ఉత్తరాదిలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం తమ భూములకు పరిహారం, ప్రయోజనాలు కోరుతూ వారు ఢిల్లీకి బయలుదేరారు. యూపీలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతుల్ని అడ్డుకోవడానికి కేంద్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించింది. అదే సమయంలో యూపీ-ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేసింది. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో రైతుల నిరసనలు చర్చనీయాంశనీయమయ్యాయి.

 

కేంద్రం కొత్తగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలతో కూడిన ఐదు కీలక డిమాండ్లను రైతులు తెరపైకి తెచ్చారు. వీటిపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వేదికగా ఎంచుకున్నారు. ఢిల్లీలోని నోయిడా నుండి పార్లమెంట్ కాంప్లెక్స్ వరకు నిరసనగా వెళ్లి తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కేంద్రం అప్రమత్తమైంది.

 

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో పోలీసులు భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ ఎత్తున రోడ్లపై మోహరించారు. రైతులు 2014 జనవరి 1 తర్వాత తమ నుంచి సేకరించిన భూమిలో 20 శాతం ప్లాట్లు ఇవ్వాలని, పాత భూస్వాధీన చట్టం ప్రకారం 10 శాతం ప్లాట్లు కేటాయించాలని, 64.7 శాతం పెంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 

అలాగే భూమిలేని రైతులకు ఉపాధి, పునరావాసం, హైపవర్ కమిటీ ఆమోదించిన సమస్యలపై ప్రభుత్వ ఉత్తర్వులు, జనావాస ప్రాంతాలకు సరైన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.ఇవాళ ర్యాలీ చేపట్టిన రైతుల్లో భారతీయ కిసాన్ పరిషత్ (బీకేపీ), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇతర అనుబంధ సంఘాలకు చెందినవారు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *