వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో కేసులకు సంబంధించి పూర్తి వివరాలు రెండు వారాల్లో ఇవ్వాలని పేర్కొంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది.
ఆర్గ్యుమెంట్ సందర్భంగా రోజువారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక ప్రశ్నలు సంధించారు.
విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్ల నేపథ్యంలో ఆలస్యమవుతోందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఈ క్రమంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీని ఆదేశించింది. అంతేకాదు కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్జ్ రూపంలో ఇవ్వాలని అందులో ప్రస్తావించింది. తదుపరి విచారణ జనవరి 13 కు వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం.