అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కేసుల నుంచి బయట పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఉపశమనం లభించలేదు. లేటెస్ట్‌గా వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు కొట్టివేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు సజ్జల భార్గవ్‌రెడ్డి. ఆయన దాఖలు చేసిన పిటిషన్ సోమవారం న్యాయస్థానం ముందుకొచ్చింది.
సజ్జల భార్గవరెడ్డి తరపున కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించారు. పాత చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వెంటనే ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకున్నారు. చట్టాలు ఎప్పటివన్నది కాదని, మహిళలను కించపరిచే విధంగా అసభ్యకరమైన పోస్టులు చూడాలన్నారు.
ఈ పోస్టుల వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ భార్గవరెడ్డి అని చెప్పారు. దర్యాప్తుకు ఆయన సహకరించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెల్లారు. ఈలోగా న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తాము చాలా విషయాలు గోప్యంగా ఉంచామని, దుర్భాషలాడితే ఎవరైనా ఒక్కటేనని వ్యాఖ్యానించింది.
తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. మీ వాదనలు ఏపీ హైకోర్టులో వినిపించాలని, పిటీషన్ అక్కడే దాఖలు చేయాలని సూచించింది. విదేశాల్లో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనంటూ రెండు వారాల గడువు కోరాడు సజ్జల భార్గవ్.
హైకోర్టును ఆశ్రయించే వరకు అంటే రెండు వారాల పాటు అరెస్ట్ చేయకూడదంటూ మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అనేది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట పులివెందుల పోలీసులు.