ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వారికే తొలి ప్రాధాన్యత..! సంక్రాంతి నుండి..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌త క్రమాన్ని ఎంచుకోవాల‌ని పేర్కొన్నారు.

 

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌త ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలన్నారు.

 

ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయాలన్నారు. అందుకోసం అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక కోటా ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. లబ్దిదారులు ఎవరైనా ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అద‌నంగా గ‌దులు నిర్మించుకోవాలని ఆస‌క్తి చూపితే అందుకు అవ‌కాశం క‌ల్పించాలి. ఈ ప‌థ‌కం స‌మ‌ర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 

ఇది ఇలావుండగా, వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా రాంరెడ్డి గార్డెన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శించారని మండిపడ్డారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని చెప్పారు. సంక్రాంతికి ఎకరాకు 7వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *