ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి తిమింగలం దొరికిపోయింది. ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. నిఖేష్ రూ.150 కోట్ల అవినీతికి పాల్పడినట్టు సోదాల్లో బయటపడింది. ఉదయం ఆరు గంటల నుండి సోదాలు చేస్తుండగా ఇప్పటికీ అతడి స్నేహితులు, బంధువల ఇండ్లలో 25 చోట్ల రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి.
నిఖేష్ కుమార్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు సోదాలు నిర్వహించారు. నిఖేశ్ కు భారీగా వ్యవసాయ భూములు, బిల్డింగులు, ఫాం హౌసులు తదితర అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆస్తులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. అక్రమాస్తులకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటూ ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ నిఖేశ్ ఇండ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా అక్రమాస్తులు గుర్తించి కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అప్పుడు సస్పెండ్ చేసినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. మరోసారి ఆయన పట్టుబడటంతో జైలుశిక్ష సైతం పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంతమంది అధికారులు పట్టుబడుతున్నా లంచాలు తీసుకునేవారి తీరులో మార్పు రావడంలేదు. ప్రజల వద్ద డబ్బులు తీసుకుంటూ.. అక్రమ పర్మిషన్ లు ఇస్తూ కోట్లకు పడగ ఎత్తుతున్నారు.