ఏపీ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతోందా? అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయా? శుక్రవారం రాత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక కారణమేంటి? ఆ భేటీలో మాజీ రాష్ట్రపతి కూడా ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది? డీటేల్స్‌లోకి వెళ్తే..
రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో తెలీదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. శుక్రవారం రాత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అక్కడే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి వారంతా చర్చించుకున్నారన్నది అసలు సారాంశం.
టీడీపీ పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. అమెరికాలో అదానీ కేసు వ్యవహారంపై చిన్నపాటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు నిధులు ఇచ్చినట్టు మీడియా కథనాల నేపథ్యంలో చర్చించారట. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారన్నది అమెరికా ప్రభుత్వ ఆరోపణ.
ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారిస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా అనేదానిపై ముఖ్యమంత్రి ఆరా తీశారట. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేపడితే అనుమానాలు తొలగించినట్టు అవుతుందని, లేకుంటే నేతలంతా ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి వెళ్తుందని అన్నారట.
గత ప్రభుత్వంలో సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వజూపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎంను విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో గవర్నర్, మాజీ రాష్ట్రపతి నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయనేది సస్పెన్స్‌గా మారింది.
సోలార్ విద్యుత్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి అధికారులను రేపో మాపో విచారించే అవకాశమున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అధికారుల తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దను విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.