రిషితేశ్వరి కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు..!

2015లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్దిని రిషితేశ్వరి కేసుపై స్థానిక కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 9 ఏళ్లపాటు సాగిన విచారణ తర్వాత ఈ కేసుపై తుది తీర్పును ఇవాళ ప్రకటించింది. అప్పట్లో నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు

రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి కాలేజీ హాస్టల్ లోనే ఉరివేసుకుని చనిపోయింది.

 

ఇది రాజకీయంగా అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో విపక్ష వైసీపీ నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి నిరనసనలు కూడా చేపట్టింది. అయితే అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై గుంటూరు కోర్టు విచారణ పూర్తి చేసింది. అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నట్లు ఇవాళ తీర్పు చెప్పింది.

 

9 ఏళ్ల పాటు జరిగిన విచారణ తర్వాత రిషితేశ్వరి ఆత్మహత్య కేసును సాక్ష్యాలు లేవన్న కారణంగా గుంటూరు కోర్టు కొట్టేయడం మరో సంచలనంగా మారింది. తమ బిడ్డ రాసిన సూసైడ్ లెటర్ ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని కోర్టు ప్రాంగణంలో ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు హైకోర్టుకు వెళ్లే స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రిషితేశ్వరి విషయంలో అప్పట్లో ఆందోళనలు చేసిన వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *