కాకినాడ పోర్టు నుంచి రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలివెళ్లిపోతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్.. అక్కడి నుంచి సముద్రంలోకి ప్రత్యేక బోటులో వెళ్లి ఓడల్ని తనిఖీ చేశారు. అందులోకి ఎవరు రేషన్ బియ్యం పంపాలని ప్రశ్నించారు. దీంతో అధికారులు నీళ్ళు నమిలారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు.
సౌతాఫ్రికాకు చెందిన ఓ భారీ ఓడలో తాజాగా భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది. జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి దాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వయంగా పోర్టుకు వెళ్లిన బియ్యం.. రేషన్ బియ్యం పోర్టుకు ఎలా చేరుతుందో ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీసిన పవన్.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు.
కాకినాడ పోర్టులో అక్రమాలు ఆపుతానని గతంలో తాను హామీ ఇచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు చేసి 51 వేల టన్నుల బియ్యం పట్టుకున్నారన్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి లారీలు వస్తాయని, కానీ భద్రతా సిబ్బంది మాత్రం 16 మందే ఉన్నారన్నారు. మంత్రి తనిఖీలు చేసినా స్థానికంగా ఉండే అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదని పవన్ ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్ వర్క్ పనిచేస్తుందన్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలి పెట్టమని పవన్ హెచ్చరించారు.
కిలో రేషన్ బియ్యానికి రూ.43 ఖర్చవుతుందని, దీన్ని రూ.73కి విదేశాల్లో అమ్ముతున్నారని పవన్ తెలిపారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలని, రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని, కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని పవన్ తెలిపారు. సీఐడీ, సీబీఐల్లో ఎవరితో దీనిపై విచారణ చేయించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్రం ఆధీనంలోనే ఉందని, ఇక్కడి నుంచి సరకుల రవాణా మాత్రమే జరగాలని పవన్ తెలిపారు.