మహారాష్ర్ట ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ‌కు ఫుల్‌స్టాప్ పడిందా..? అమిత్ షాతో చర్చలు సక్సెస్.. మౌనంగా షిండే..!

మహారాష్ర్ట ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ‌కు ఫుల్‌స్టాప్ పడిందా? బీజేపీ పెద్దలతో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయా? మహారాష్ట్ర నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందా? పీఠంపై ఫార్ములా ఏంటి? ఏక్‌నాథ్ షిండే ఎందుకు డల్‌గా కనిపించారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది కాసేపట్లో ప్రకటన వెలువడనుంది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీ వెళ్లిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌, అజిత్ పవార్‌లు గురువారం రాత్రి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.

 

హోంమంత్రి అమిత్ షా నివాసంలో దాదాపు రెండుగంటలపాటు జరిగిన చర్చల్లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. సమావేశం తర్వాత నేరుగా ముంబైకి బయలుదేరారు ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే.

 

ఈ సమావేశంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై మిగతా రెండు మిత్ర పక్షాలు అంగీకారం తెలిపాయి. కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పగ్గాలు అందుకోనున్నారట. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఏక్‌నాథ్ షిండే అన్నట్లు అంతర్గత సమాచారం.

 

ఇందుకోసం కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చిందట బీజేపీ. షిండే‌కు కేంద్రమంత్రి పదవి లేదా గవర్నర్ లేదా డిప్యూటీ సీఎం లాంటి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందట బీజేపీ. దానికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫోటోల్లో షిండే కాస్తింత డల్‌గా ఉన్నారట.

 

డిప్యూటీ సీఎంగా కొనసాగడంతోపాటు ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హోం శాఖ, ఆర్థిక, రెవెన్యూ శాఖలు బీజేపీ వద్ద ఉండే అవకాశముంది. పట్టణాభివృద్ధి శాఖ, పీడబ్ల్యూడీ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు శివసేనకు కేటాయించనున్నారు.

 

ఎన్సీపీకి వ్యవసాయం, నీటిపారుదల, ఆహార సరఫరా, వైద్య మరియు సాంకేతిక విద్య మంత్రిత్వ శాఖలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌‌లు ఉండనున్నారు. మరో రెండు రోజుల్లో మహాయుతి కూటమి సమావేశమై శాసనసభా పక్ష నాయకుడ్ని ఎన్నుకోనుంది. ప్రమాణ స్వీకారోత్సవంపై చర్చించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *