కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మరో సూపర్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు అద్దేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించగా, తాజాగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9నే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ కేంద్రం జీవో విడుదల చేసింది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. అంతేకాదు, LHB, EMU కోచ్ ల తయారీకి ప్రణాళిక సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వేకు ఆదేశాలు జారీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. కాజీపేట రైల్వే డివిజన్ గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ మొదలు పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో కోచ్ ఫ్యాక్టరీ తయారీకి సౌత్ సెంట్రల్ రైల్వే పనులు మొదలు పెట్టింది.
50 ఏండ్లుగా కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు
తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ గా ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సుమారు అర్థశతాబ్దానికి పైగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తొలి తెలంగాణ ఉద్యమ సమయం(1969)లోనే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు షురూ అయ్యాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు పలుమార్లు హామీలు ఇచ్చినా నెరవేరలేదు. 2014లో ఏపీ పునర్విభజన చట్టంలోనూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నాటి మన్మోహన్ సర్కారు హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత అమలుకు నోచుకోలేదు. 2016లో మోడీ ప్రభుత్వం కాజీపేటకు రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపును మంజూరు చేసింది. దానికి 160 ఎకరాల భూమి కావాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 8 ఏండ్లు నానబెట్టి చివరికి భూమిని అప్పగించింది. 2023లో వరంగల్ కు వచ్చిన ప్రధాని మోడీ POH పనులతో పాటు వ్యాగన్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వ్యాగన్ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సంతోషం వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు ప్రజలు
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం తరచుగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు సైతం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎట్టకేలకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలపడంతో పాటు బొగ్గు రవాణాలో కీలకంగా ఉన్న కాజీపేట జంక్షన్ డివిజన్ గా ఏర్పాటైతే దాదాపు 60 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ నేపథ్యంలో ఓరుగల్లు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఉద్యోగ సంఘాల నేతలు, కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి సభ్యులతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. కోచ్ ఫ్యాక్టరీ తయారీతో కాజీపేట దశ మారిపోతుందంటున్నారు