కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది. నిలిచిపోయిన రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణాలు తొమ్మిది నుంచి 24 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ నిర్ణయించింది. ఇందు కోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను సీఆర్డీఏకు అప్పగించింది.
నిర్మాణాల ప్రణాళికలు
అమరావతి రాజధాని పనులు తిరిగి డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా చేపట్టాల్సిన పనులు..అవి పూర్తి చేయాల్సిన గడువును ఖరారు చేసారు. వచ్చే నెల 15న కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ పనులను ఆరోజున ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. రూ.731.30 కోట్ల వ్యయంతో గతంలో టెండర్లు ఖరారు చేసిన ఈ భవనాల నిర్మాణం ఇప్పటి వరకు దాదాపుగా 74 శాతం వరకు పూర్తయింది. వీటిని బహుళ అంతస్థులుగా నిర్మాణం చేయనున్నారు. ఇందు కోసం ఇప్పటికే కాంట్రాక్ట్టు సంస్థకు రూ.380.12 కోట్లు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా అంచనాలతో
గతంలో పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిన పనులను తాజా అంచనాల మేరకు ప్రతిపాదన లు సమర్పించారు. ఈ నిర్మాణాలను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అదే విధంగా ఎన్జీవో, మంత్రులు, న్యాయమూర్తుల నివాసాల నిర్మాణాలను 15వ తేదీనే తిరిగి ప్రారంభించనున్నారు. వీటిని పూర్తి చేయటానికి తొమ్మిది నెలల సమయం నిర్దేశించారు. గవర్నమెంట్ టైప్-1, టైప్-2 (గ్రూప్ డీ), గ్రూప్ బీ, గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణ పనులు కూడా అదే రోజున ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్మాణాలు తొలి దశలో రూ.996.05 కోట్ల వ్యయంతో చేపట్టగా 62 శాతం మేర పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అమరావతికి బిగ్ డే
రాజధానిలో మరో కీలక ఘట్టంగా భావిస్తున్న ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా పనులనూ వచ్చేనెల 15న ప్రారంభించనున్నారు. జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4, జోన్-5, జోన్-6లలో పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో గతంలో 20,482 ఎకరాల విస్తీర్ణంలో 67,912 ప్లాట్లలో రూ.12,629 కోట్ల వ్యయంతో 12జోన్లలోనూ పనులు మొదలు పెట్టారు. తాజా నిర్ణయం మేరకు ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా పనులను రెండు దశల్లో చేపట్టనున్నారు. ఈ పనులను రెండేళ్ల కాలంలో పూర్తి చేసేలా ప్రభుత్వం డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. దీంతో, డిసెంబర్ 15న అమరావతి నిర్మాణంలో బిగ్ డే గా నిలవనుంది.