నానా హైరానా చేస్తున్న గేమ్ చేంజర్ పాట..! శంకర్ మార్క్ కనిపిస్తోందిగా..!

తమిళ దర్శకుడు శంకర్.. సినిమాలకు ఎంత ఖర్చుపెడతారు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆయన పాటల కోసం పెట్టే ఖర్చు ఎప్పటికప్పుడు సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’లో కూడా అలాంటి హై బడ్జెట్ పాటలనే ప్లాన్ చేశారు. అందులో నుండి ఒక పాట అయిన ‘నానా హైరానా’ (NaaNaa Hyraanaa) తాజాగా విడుదలయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడారు. ఇప్పటికే ఈ సాంగ్‌పై హైప్ క్రియేట్ చేయడం కోసం ఒక రిహార్సెల్ వీడియోను విడుదల చేశారు. అప్పటినుండే ఈ పాట కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుండగా.. తాజాగా దీని పూర్తి లిరికల్ వీడియో విడుదలయ్యింది.

 

కెమిస్ట్రీ అదుర్స్

 

రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) కలిసి ఇప్పటికే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా ఎలా ఉన్నా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులకు చాలానే నచ్చింది. ఇక ఇన్నాళ్ల తర్వాత మరోసారి ‘గేమ్ ఛేంజర్’లో జతకట్టి ఫ్యాన్స్‌ను అలరించనున్నారు చరణ్, కియారా. ఇప్పటికే ఈ మూవీ నుండి ‘జరగండి’ అనే పాట విడుదలయ్యింది. అది డ్యాన్స్ నెంబర్ కాబట్టి అందులో వీరి డ్యాన్స్ మాత్రమే హైలెట్ అయ్యింది. కానీ ‘నానా హైరానా’ అలా కాదు.. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ పాటతోనే బయటపెట్టారు దర్శకుడు శంకర్.

 

లూప్‌లో వినడం ఖాయం

 

మ్యూజిక్ లవర్స్ కొన్నాళ్ల పాటు ఈ పాటను లూప్‌లో వినడం ఖాయమని రామ్ చరణ్ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ‘నానా హైరానా’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో మాత్రమే విడుదలయినా ఫుల్ వీడియో సాంగ్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకులకు ఐడియా వచ్చేస్తుంది. శంకర్ సినిమా పాటలంటేనే లొకేషన్స్ రిచ్‌గా ఉండాాలి. అదొక లవ్ సాంగ్ అయితే కచ్చితంగా దాని లొకేషన్స్ వేరే లెవెల్‌లో ఉండాలి. ఇది ఫుల్ వీడియో సాంగ్ కాదు కాబట్టి లిరికల్ వీడియోలో చూసినంత వరకు శంకర్ మార్క్‌ కనిపిస్తోందని, లొకేషన్స్ చాలా రిచ్‌గా ఉన్నాయని ఆడియన్స్ అనుకుంటున్నారు.

 

వాయిస్‌తో మ్యాజిక్

 

కార్తిక్, శ్రేయా ఘోషల్ వాయిస్.. ‘నానా హైరానా’ పాటకు ప్రాణం పోశాయి. వినడానికి ఈ మెలోడీ చాలా బాగుందని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. కానీ లిరికల్ వీడియో విషయంలో మాత్రం ప్రేక్షకులు పూర్తిస్థాయిలో తృప్తిపడలేదు. లొకేషన్స్‌ను చూపించినంత వరకు వీడియో బాగానే ఉన్నా.. లిరిక్స్ వచ్చే సమయానికి ఎడిటింగ్ చాలా బోరింగ్ అనిపించేలా ఉంది. ముఖ్యంగా పాత కాలంలో పెళ్లి వీడియోలో చేసే ఎడిటింగ్ అంతా ‘నానా హైరానా’ లిరికల్ వీడియోలోనే కనిపిస్తుందని ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసే లిరిక్స్ మరోసారి అందరినీ ప్రేమలో పడేసేలా ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *