ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు ఖాళీ..! బీఆర్ఎస్ పార్టీ బాగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా..?

ఆ ఉమ్మడి జిల్లాలో గత పదేళ్లు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా ? కారు పార్టీని వలసల టెన్షన్ భయపెడుతుందా ? ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలంతా మారగా.. ఇప్పుడు మండల, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ లో చేరడంతో కారు ఖాళీ అయ్యిందా ? జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరడంతో.. పార్టీని నడిపించే నేతలే కరువయ్యారా ? ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గులాబీ బాస్ ని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మ్యాటర్ కలవరపడుతుందా ? వాచ్ థిస్ స్టోరీ…

 

12 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోందట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ లో చేరిన నాయకులంతా తిరిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు. వలసల పరంపర కొనసాగుతుండగా.. చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయట. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పలు సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రజాప్రతినిధులు అంతా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం గులాబీ బాస్ ని కలవరపెడుతుందట. ఓ పక్క గులాబీ దళం రోజురోజుకీ పడిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో బలపడుతుండడడం.. బీఆర్ఎస్ శ్రేణులను అయోమయంలో పడేస్తోందట.

 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు లోకసభ స్థానాల్లో ప్రభావం చూపగల బలమైన నేత.. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆయన కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం.. తెలంగాణ డెయిరీ చైర్మన్‌గా నియమించడం కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత ప్లస్ గా మారిందట. దీంతో జిల్లాలో పార్టీని నడిపించే నేతలే లేరని మీమాంసలో ఉన్నారట. అంతే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు బడా, చోటా లీడర్లు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్ గూటికి చేరిపోవడం బీఆర్ఎస్ అధినేతకు తలనొప్పిగా మారిందట.

 

ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ కు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే నాయకులే కరువయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో… అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ పాలకవర్గాలను గద్దె దింపారు. ఆయా మండలాలు, గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాల ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కు నడిపించే నేతలు కరువయ్యారట. పదేళ్ల బీఆర్ఎస్ పాలన సమయంలో అన్ని పార్టీల నాయకుల రాకతో కిటకిటలాడిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు కనీసం స్థానిక నాయకులే లేకుండాపోయ్యారనే చర్చ జోరుగా జరుగుతుందట.

 

ఒక వైపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి గులాబీ బాస్ కోలుకోకముందే.. పార్టీలో వలసల పర్వం నడుస్తుండడం ఆందోళన కలిగిస్తుందట. అన్ని చక్కబెట్టాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారని విమర్శను మూటగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ కనిపించక పోవడం ఆ వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలం అయ్యారని సొంత నేతలే ఎత్తిపొడుస్తున్నారట.

 

గ్రామస్థాయి నుంచి జిల్లాల వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి … స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగిస్తే వారైనా కనీసం పార్టీ శ్రేణులను యాక్టివ్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లేకపోతే స్థానిక‌సంస్థల ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపి, పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి తలెత్తుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ ని.. జిల్లాలో నడిపించే నాయకులు వస్తారా ? పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతుందట.

 

తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. గడ్డు కాలాన్ని అధిగమించేందుకు ఏం యాక్షన్ తీసుకుంటుంది. పార్టీ క్యాడర్ ని మళ్లీ యాక్టివ్ చేసే బాధ్యతలను ఎవరికి ఇస్తారు.. లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి పరాభవం తప్పదా అని టాక్నడుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *